రామకృష్ణ మఠంలో కన్నుల పండువగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
ఆర్.బి.ఎం హైదరాబాద్: హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. లవ్ ఇండియా- సర్వ్ ఇండియా పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద అనుక్షణం దేశం కోసం తపించారని గుర్తు చేశారు. దేశవ్యాప్త పర్యటన చేశాక స్వామి వివేకానంద కన్యాకుమారిలో 1892 డిసెంబర్ 25 నుంచి 27 వరకూ మూడు రోజుల పాటు ఏకధాటిగా ధ్యానం చేసి దేశ ఉజ్వల భవిష్యత్తును ఊహించారని ఆయన చెప్పారు. బ్రిటీషువారి పాలనలో ఉన్నా అన్ని ఇబ్బందులూ అధిగమించి దేశం విశ్వగురువుగా ఆవిర్భవిస్తుందని స్వామి వివేకానంద ముందే ఊహించారని స్వామి బోధమయానంద చెప్పారు. వివేకానందుడిలా దేశాన్ని ప్రేమించాలని, దేశ ప్రజలసేవలో తరించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు అనేక విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున జరగాల్సి ఉన్నా అంత స్థాయిలో జరగకపోవడంపై స్వామి బోధమయానంద ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది ప్రభుత్వానిది కాదని ప్రజలదని గుర్తించాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సేవ గొప్పతనాన్ని వివరించారు. ఇతరుల కోసం జీవించేవారే గొప్పవారన్న స్వామి వివేకానంద సూక్తిని ఆయన గుర్తు చేశారు. ఎందరో మహనీయుల త్యాగం వల్లనే స్వాతంత్ర్యం వచ్చిందని, బాధ్యతగా జీవించడం ద్వారా వారికి నివాళి అర్పించాలన్నారు.
కార్యక్రమంలో ఎన్ సీ సీ ట్రైనింగ్ ఆఫీసర్ కల్నల్ ప్రవీణ్, నెల్లూరుకు చెందిన చైల్డ్ ఆశ్రమ నిర్వాహకులు శరత్ బాబు, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆగస్ట్ 11న ఆజాదీ కా అమృత్ మహోత్సవ ముగింపు కార్యక్రమం హైదరాబాద్ రామకృష్ణ మఠంలో నిర్వహిస్తామని స్వామి బోధమయానంద తెలిపారు.