మునుగోడు నుంచి బరిలోకి కేసీఆర్?
ఆర్.బి.ఎం హైదరాబాద్: సీఎం కేసీఆర్ వ్యూహం మార్చినట్లు చెబుతున్నారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని శత్రుదుర్భేధ్యంగా మార్చారు. అయితే రాజకీయ సమీకరణల్లో భాగంగా గజ్వేల్‌కు స్వస్తి చెప్పాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని అందరూ అనుకున్నారు. వీరికి ఊహలకు కారణాలు లేకపోలేదు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ముందస్తు తప్పదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరెవరూ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రధానంగా అందరి దృష్టి సీఎం అభ్యర్థులపైనే పడడం సహజం. అయితే ఇప్పుడు కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై పెద్ద చర్చ నడుస్తోంది. కేసీఆర్ ఈ సారి యాదాద్రి-భవనగిరి జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారట.
ఎందుకంటే ఇక్కడి నుంచి పోటీ చేస్తే దక్షిణ తెలంగాణలో కేసీఆర్ గట్టి పట్టు సాధించాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఈ ప్రభావం ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలపై కూడా టీఆర్ఎస్ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం అధికంగా ఉంది. అందువల్ల మునుగోడు నుంచి గెలిచి కోమటిరెడ్డి ప్రభావాన్ని తగ్గించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మునుగోడు నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గత మూడేళ్లుగా రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంపై దృష్టి సారించలేదు. వచ్చే ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తారా? బీజేపీ తరఫున బరిలోకి దిగుతారా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపుతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా పట్టు సాధించవచ్చని కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు.
