తాండూరు: సీఎం కేసీఆర్ పాలన చూసి సహించలేని బీజేపీ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేసిందని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆరోపించారు. దొంగ స్వామీజీలను పంపి డబ్బుతో కొనాలని ప్రలోభ పెట్టిందని మండిపడ్డారు. రూ.100కోట్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంలో పదవులు, కాంట్రాక్ట్‌లు, వై-కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి దేశంలో నెంబర్-1గా చలామణి అవుతున్న ప్రధాన నాయకులను కల్పిస్తామని ఆశ చూపించే ప్రయత్నాలు చేశారని తెలిపారు. ‘‘జీవితంలో ఎప్పుడూ చూడనంత ధనం తీసుకుని హాయిగా ఏ విదేశానికో పోవచ్చు, తరతరాలుగా కూర్చుని తినొచ్చు. కానీ అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో వారి మాట వినకపోతే కేంద్ర వ్యవస్థల ద్వారా దాడులు చేస్తామని కూడా భయపెట్టారు. వారి కుట్రలను మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి భగ్నం చేశాను. ఇప్పుడు వారు జైల్లో చిప్పకూడు తింటున్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల అభిమానం ఉన్నంత వరకు తాను ఎవరికీ భయపడనని, బీజేపీని శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే అడుగు పడిందని,. తెలంగాణలో ఆ దృష్టం నాకు దక్కడం పూర్వజన్మ సుకృతం’’ అని కరపత్రంలో రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు.
రూ.100 కోట్లు ఇస్తామన్నా మనస్సాక్షి ఒప్పుకోలేదు: రోహిత్‌రెడ్డి
