బీజేపీని దంచికొడతారు: హరీశ్‌రావు
ఆర్.బి.ఎం హైదరాబాద్: తెలంగాణలో పాదయాత్ర చేపడితే బీజేపీని ప్రజలు దంచి కొడతారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. బీజేపీ నాయకులు తెలంగాణలో ఏ ముఖం పెట్టుకుని పాదయాత్రలు చేస్తారని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. తొమ్మిది రోజుల్లో ఎనిమిదిసార్లు పెట్రోల్ ధరలు పెంచిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. తెలంగాణకు రావాల్సిన ఉపాధిహామీ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 25వేల కోట్ల కోత పెట్టిందన్నారు. ఉపాధిహామీ కూలీలపై ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు పనిదినాలను రూ. 13వేల కోట్ల నుంచి రూ. 16 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో ఏ కాలంలో చూసినా వానాకాలంలాగే ఉందన్నారు. కాళేశ్వరం నీటితో ప్రతీ చెరువును నింపుతున్నామని తెలిపారు. కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులపై ఉక్కుపాదం మోపిన ఘనత కేంద్రానిదేనని మండిపడ్డారు. దళితుల కోసం ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి, రిజర్వేషన్లు తదితర పథకాలు అమలు చేస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు.
