బీజేపీకి ‘బీ’టీం ఎంఐఎం.. రెండు పార్టీలకు సంధానకర్తగా కేసీఆర్!

bjp trs mim

బీజేపీకి ‘బీ’టీం ఎంఐఎం.. రెండు పార్టీలకు సంధానకర్తగా కేసీఆర్!

ఆర్.బి.ఎం హైదరాబాద్: ఎంఐఎం పార్టీ బీజేపీ ‘బీ’టీం మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా డైరక్షన్‌లోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పనిచేస్తున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల బరిలో దిగడానికి అసదుద్దీన్ ఓవైసీ సన్నద్దమవుతున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో కేవలం 36 సీట్లకే పోటీ చేసిన ఎంఐ ఎం ఈసారి 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముస్లిం ఓట్లను చీల్చి బిజెపికి లాభం చేకూర్చడానికే అసదుద్దీన్ యుపిపై కన్నేసేశారని, నిజానికి ఎంఐఎం బీజేపీ ‘బి’టీంగా మారిందన్న విమర్శలూ సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో తనకు బలం లేని అనేక రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీచేసి పరోక్షంగా బీజేపీకి సహకరించదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. బెంగాల్, గుజరాత్, మహారాష్ర్ట, బిహార్‌లలో పోటీచేసిన ఎంఐఎం కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండి కొట్టిందనే వాదనలు కూడా వినిపించాయి.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన ప్రచారంలో ప్రధానంగా బీఎస్పీ నేత మాయావతి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్‌లను టార్గెట్ చేస్తున్నారు. తనపై ఆరోపణలు చేసేవారికి ఓవైసీ గట్టిగానే బదులిస్తున్నారు. తమ పార్టీ ఓట్లు చీల్చితే..గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు ఎలా గెలిచారని ఆయన ప్రశ్నిస్తున్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం ఓట్లతో బీజేపీ గెలవలేదని గుర్తు చేశారు. ముస్లిం ప్రయోజనాల్ని కాపాడేందుకే దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తోందని చెప్పారు.

అయితే ఎంఐఎం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని బీజేపీ స్వాగతిస్తోంది. ఎంఐఎం పోటీ వల్ల బీజేపీకే లాభం జరుగుతుందని ఆ పార్టీ నేత సాక్షి మహారాజ్ అన్నారు. ఓవైసీ బీహార్‌లో తమ విజయానికి సహకరించారని, ఉత్తరప్రదేశ్‌లోనూ అదే చేస్తారని అన్నారు. గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎంఐఎం ఐదు స్థానాల్లో విజయం సాధించింది.

One Comment on “బీజేపీకి ‘బీ’టీం ఎంఐఎం.. రెండు పార్టీలకు సంధానకర్తగా కేసీఆర్!”

Leave a Reply

Your email address will not be published.