రామకృష్ణ మఠం సందర్శించిన కార్గిల్ యోధుడు కెప్టెన్ నవీన్ నాగప్ప

రామకృష్ణ మఠం సందర్శించిన కార్గిల్ యోధుడు కెప్టెన్ నవీన్ నాగప్ప

హైదరాబాద్: అమరవీరుల త్యాగాలు గుర్తించి గౌరవించడమే సైనికులకు ఇచ్చే నిజమైన నివాళి అని కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న కెప్టెన్ నవీన్ నాగప్ప చెప్పారు. జూలై 26న కార్గిల్ దివస్ రోజున దీపాలు వెలిగించి సైనిక అమరవీరులకు నివాళి అర్పించాలని ఆయన సూచించారు.

హైదరాబాద్ రామకృష్ణ మఠంలో జరుగుతున్న శౌర్య శిబిరంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంపై భక్తి భావనతో సేవ చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకుంటున్న యువతను ఆయన అభినందించారు. కార్గిల్ యుద్ధంలో భాగంగా 1999 జులై 7న శత్రు సేనలు జరిపిన దాడిలో కెప్టెన్ నవీన్ నాగప్ప తీవ్ర గాయాలపాలై 21 నెలల పాటు చికిత్స పొందారు. 8 సర్జరీల తర్వాతే ఆయన కోలుకున్నారు.

హైదరాబాద్ రామకృష్ణ మఠానికి విచ్చేసిన కెప్టెన్ నవీన్ నాగప్పను ఈ సందర్భంగా రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మెమెంటో, శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా ఎఫెక్టివ్ లీడర్ షిప్ అంశంపై హెచ్ఆర్ ఎక్స్పర్ట్ ప్రత్యూష ప్రసంగించారు. శిబిరం ముగింపు సమావేశంలో ప్రసంగించిన స్వామి బోధమయానంద
విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. రోజు గంటన్నర పాటు యోగ, ధ్యానం, వివేకానంద సాహిత్య పఠనం చేయాలని సూచించారు. స్వామి వివేకానంద సాహిత్యం చదివితే కుంగుబాటు, ప్రతికూల ఆలోచనలు దరికి రావని స్వామి బోధమయానంద చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.