భక్తి ప్రపత్తులతో పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలు
హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలను దేశవ్యాప్తంగా భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ బేగంపేట చికోటి గార్డెన్స్ లోని యోగదా సత్సంగ ధ్యాన కేంద్రంలో భక్తులు ప్రత్యేక ధ్యానం, భజనల్లో పాల్గొన్నారు. పరమహంస యోగానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ తదితర పుస్తకాలనుంచి కొన్ని మధుర ఘట్టాలను భక్తులకు చదివి వినిపించారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు వైఎస్ఎస్ గురుపరంపరలో ఒకరైన స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి మహాసమాధి ఆరాధన ఉత్సవాలు బేగంపేట ధ్యానకేంద్రంలో జరుగుతాయని వైఎస్ఎస్ కార్యదర్శి శశివదనా రెడ్డి తెలిపారు. —మార్చి నెలలో రెండు మహానిష్క్రమణలు — దైవసాక్షాత్కారం పొందిన గురువు మరణసమయంలో తన శరీరాన్ని సస్పృహతో విడిచిపెట్టడాన్ని మహా సమాధి అంటారు. శ్రీయుక్తేశ్వర్ గిరి 1936, మార్చి 9న మహాసమాధి చెందితే, ప్రపంచఖ్యాతి పొందిన ఆయన శిష్యులు పరమహంస యోగానంద 1952, మార్చి 7న మహాసమాధి చెందారు.
క్రియాయోగ పరంపరకు చెందిన ఈ ఇరువురు గురువులూ తమ శరీరాలను, అంతవరకూ తమతో కలిసి జీవించిన ఒక వస్త్రాన్ని త్యజించినట్టుగా, వదిలిపెట్టారు; తడవకు ఒక అతిదీర్ఘ క్రియా శ్వాసతో, వారి శిష్యులను మోక్షం వైపు నడిపిస్తూ, జీవించారు.
“ఒక యోగి ఆత్మకథ” పుస్తకంలో వర్ణించినట్టుగా క్రియాయోగం ప్రతిశ్వాసతోనూ రక్తప్రవాహాన్ని కర్బనరహితం చేస్తూ తద్ద్వారా శరీరకణాల నశింపును అంతకంతకూ తగ్గిస్తూ చివరకు నివారిస్తుంది. తద్ద్వారా పోగైన అదనపు ఆక్సిజన్ పరమాణువులు కణాల్ని స్వచ్ఛమైన శక్తిగా మారుస్తాయి. ఆ విధంగా 30 సెకండ్లపాటు చేసే ఒక క్రియాశ్వాస ఒక ఏడాదిలో సహజ రీతిలో జరిగే ఆధ్యాత్మికాభివృద్ధిని వ్యక్తిలో కలిగిస్తుంది.
ఇది శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన ఒక ప్రాచీన విజ్ఞానం. ఆ తరువాతికాలంలో అది పతంజలికి, మరికొందరు శిష్యులకూ తెలిసింది. ఈ యుగంలో మహావతార బాబాజీ లాహిరీ మహాశయులకు ఇవ్వగా, ఆయన యోగానందుల గురువైన శ్రీయుక్తేశ్వర్ కు ఉపదేశించారు.
1910వ సంవత్సరంలో తనకు 17 ఏళ్ల వయసప్పుడు యోగానంద తన గురువైన యుక్తేశ్వర్ ని కలిశారు. ఆశ్రమంలోని ఇతర బాలురు కఠినమైన శిక్షణకు భయపడి మరింత ఉపశమనకర వచనాలను కోరి పారిపోతుండగా యోగానంద మాత్రం గురువు ఆదేశాలను తన ఆత్మలోనికి తీసుకొన్నాడు. బాబాజీ కొన్నేళ్ళ క్రితం శ్రీయుక్తేశ్వర్ తో పాశ్చాత్య దేశాల్లో క్రియాయోగ వ్యాప్తికి తాను ఎన్నిక చేసిన వ్యక్తి యోగానంద అని చెప్పి పెట్టడం వల్ల ఈ పిల్లవాడిని గురువు మరొక గురువుగా తయారు చేసేందుకు కావలసిన శిక్షణ అప్పుడు ఆయన ఇస్తున్నారు.
యోగానంద మొదట్లో తూర్పుదేశాల్లోనే ఒక సంస్థను స్థాపించడానికి వెనుకాడినా, తన గురువు ఆజ్ఞకు తలవంచి అందుకు అంగీకరించారు. 1917 లో ఆయన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS) ని స్థాపించారు. 1920లో భవిష్యవాణిలో చెప్పబడిన అమెరికా పిలుపు వచ్చింది. యువగురువు ఆ క్రొత్త దేశానికి బయలుదేరాడు. యోగం ఆ దేశానికి ఎంత అపరిచితమైనదో అక్కడి భాషా ఆయనకు అంతే. కానీ దైవసాక్షాత్కారం పొందిన ఒక గురువుకు భాషా సమస్య అవరోధం కాలేకపోయింది. ఆయన తన మొదటి ఆంగ్లప్రవచనం తనను పశ్చిమానికి తీసుకు వెడుతున్న నౌకలోనే ఇవ్వవలసి వచ్చింది. ఆ తరువాత అమెరికాలో ఆయన మాట్లాడడానికి భగవంతుడు ఎన్నిక చేసిన ప్రతి నగరంలోనూ ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చే శ్రోతలతో హాళ్లు నిండిపోయేవి. ఇది 1920 లో సెల్ఫ్ రియలైజెషన్ ఫెలోషిప్ (SRF) స్థాపనకు దారి తీసింది.
సాటిలేని ఈ గురువు — ఒక అద్భుతంగా నిలచిన — తన మహాసమాధి వరకూ సన్న్యాసులకూ, గృహస్తులకూ కూడా క్రియాయోగంలో శిక్షణ ఇచ్చారు. చనిపోయిన 20 రోజుల తరువాత కూడా ఆయన భౌతికకాయం ఎలాంటి విఘటన చిహ్నాలను చూపలేదు. శవాగార (మార్చురీ) డైరెక్టర్ హారీ టి. రోవ్ ఇలా తన పరిశీలనను నమోదు చేశారు, పరమహంస యోగానంద శరీరం “అద్భుత నిర్వికార స్థితి” లో నిలిచి ఉంది. మహాత్ముడైన ఈ గురువు జీవితంలోనూ, మరణంలోనూ యోగ, ధ్యానం ద్వారా ప్రకృతిశక్తులపైన, కాలంపైన కూడా విజయం సాధించవచ్చని మానవజాతికి రుజువు చేశారు.
యోగానంద తన మాటల్లోనే చేసిన వాగ్దానం ప్రకారం ఆయన మహాసమాధి చెంది 73 ఏళ్ళు గడచినా, గృహ అధ్యయనం కోసం రూపొందించిన ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాల ద్వారా శ్రద్ధాళువులైన తన శిష్యులకు క్రియాయోగాన్ని నేర్పిస్తూనే ఉన్నారు. “ఆంతరిక ఆధ్యాత్మిక సహాయాన్ని నిజంగా అన్వేషిస్తూ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా కి వచ్చిన వారందరూ వారు కోరుకునేది భగవంతుడి నుంచి తప్పక పొందుతారు. నేను శరీరంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినా, లేక తరువాత వచ్చినా.” మరింత సమాచారం కోసం : yssofindia.org సందర్శించండి: