స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి దివ్యజ్ఞాన పరిచయం
(170 వ జన్మోత్సవ ప్రత్యేకం)
“నువ్వు కనక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇకముందు ప్రతీదీ మెరుగవుతుంది.” — స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి
ఈ మరపురాని వాక్కులతో స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి భవిష్యత్తులో మన జీవితంలో శుభకరమైన మార్పులు కలగడానికి ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయత్నం చేయడం ఎంత ముఖ్యమో చాటి చెప్పారు. మనం అత్యున్నత ప్రయత్నాలు చేయాలని ఇచ్చిన పిలుపు ఇది. ఇంకా ఆయన క్లుప్తంగా ఇలా చెప్పారు: “దైవసాక్షాత్కారం పొందడమంటే అన్ని దుఃఖాలకీ అంత్యక్రియ జరిపించడమే.” ఎంత గొప్ప వాగ్దానం: భగవదాన్వేషణలో దుఃఖమంటూ లేని, సంతోషానందాలతో కూడిన జీవితం!
శ్రీయుక్తేశ్వర్ మే 10, 1855లో పశ్చిమ బెంగాలులోని శ్రీరాంపూర్ లో జన్మించారు. అప్పుడాయన పేరు ప్రియనాథ్ కరార్. ఆయన తండ్రి ఒక సంపన్న వ్యాపారి. వారణాసిలోని మహా ఋషి లాహిరీ మహాశయుల శిక్షణలో ఆయన రూపుదాల్చిన జ్ఞానం — జ్ఞానావతారులుగా అత్యున్నత స్థితిని అందుకొన్నారు. అనంతరం గిరి శాఖకు చెందిన స్వామి అయ్యారు.
మహావతార్ బాబాజీ.. అనంతర కాలంలో శ్రీ శ్రీ పరమహంస యోగానందగా పేరొందిన — ముకుందలాల్ ఘోష్ ను పశ్చిమ బెంగాలులో శ్రీరాంపూర్ లోని శ్రీయుక్తేశ్వర్ ఆశ్రమంలో ప్రత్యేక శిక్షణకోసం వెళ్ళేలా మార్గనిర్దేశం చేశారు. వారణాసి వీధుల్లో మొదటిసారి శ్రీయుక్తేశ్వర్ ను కలిసిన వెంటనే యోగానంద ఆయనతో తనకు గల నిగూఢమైన సంబంధాన్ని గుర్తించారు. తన అసంఖ్యాక ధ్యానసమయాల్లో కలిగిన దర్శనాల్లో తాను దర్శించిన తన గురువును చివరికి గుర్తించగలిగానని ఆయన గ్రహించారు.
తన గురువైన శ్రీయుక్తేశ్వర్ చే మలచబడి, ప్రపంచాన్ని అత్యున్నత ప్రాచీన భారతీయ ధ్యాన ప్రక్రియ అయిన క్రియాయోగానికి పరిచయం చేసి, అంతర్జాతీయంగా ప్రాముఖ్యత గలిగిన ఒక ఆధ్యాత్మిక గురువుగా ఎదిగారు. యోగానంద ఆధ్యాత్మిక పుస్తకం “ఒక యోగి ఆత్మకథ “ ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని ప్రభావితులను చేసి, 50 కి పైగా భాషలలోకి అనువదించబడింది. తన గురువు పాదపద్మాలచెంత తాను పొందిన జ్ఞానాన్ని వ్యాప్తి చెందించడానికి భారతదేశంలోని రాంచీలో 1917 లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS) ని , 1920 లో లాస్ ఏంజిలిస్ లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (SRF) ని స్థాపించారు.
శ్రీయుక్తేశ్వర్ కఠినమైన క్రమశిక్షణవాది. “నా దగ్గరికి తర్ఫీదుకు వచ్చినవాళ్ల విషయంలో నేను కఠినంగా ఉంటాను, అది నా పద్ధతి. దాన్ని ఒప్పుకో, మానుకో; అందులో నేను రాజీపడను.” అని ఆన్నారాయన.“ కానీ అదే సమయంలో ఒక తల్లి తన పిల్లల పట్ల చూపినంత గాఢమైన శ్రద్ధ ఆయన వారిపట్ల చూపేవారు. తన ఆత్మకథలోని 12 వ అధ్యాయంలో తన దివ్య గురువు యొక్క డేగలాంటి పర్యవేక్షణలో, ఆయన క్రమశిక్షణ అనే సమ్మెట బరువు కింద తాను అనేక సార్లు విలవిలలాడినప్పటికీ — ఆధ్యాత్మికంగా తాను ఎలా పరిణతి సాధించారో వర్ణించారు. “నా గర్వాన్ని సమ్మెట దెబ్బలతో అణిచేసినందుకు నేనాయనకి ఎంతో కృతజ్ఞుణ్ణి. ఆలంకారికంగా చెప్పాలంటే, నా దవడకున్న పలువరసలో ప్రతి పిప్పిపన్నూ కనిపెట్టి పీకేస్తున్నారాయన, అని ఒక్కొక్కప్పుడు అనిపించేది నాకు.”
ఆధ్యాత్మికంగా అంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా, శ్రీయుక్తేశ్వర్ సాదాగా, వినయంగా ఉండేవారు. దర్పాన్ని కానీ తన అంతరిక వైరాగ్యాన్ని గానీ గొప్పగా బాహ్యంగా ప్రదర్శించడం ఆయనకు చేతకాదు. అనంత పరమాత్మ పట్ల ఆయనకు గల లోతైన అవగాహన ఆయనకు అలవాటైన మౌనంలోనూ, జ్ఞానపూర్ణాలైన ఆయన ప్రతీ పలుకులోనూ ప్రతిఫలించేవి. యోగానంద భక్తిపూర్ణంగా ఇలా అన్నారు, “సజీవంగా ఆవిర్భవించిన పరమేశ్వర సన్నిధానంలో ఉన్నానన్న స్పృహ నాకు ఎప్పుడూ ఉండేది. ఆయన దివ్యత్వపు భారం, ఆయన ఎదుట ఎప్పుడూ నా తల వంగేటట్టు చేసేది.”
ఆయన ధార్మికగ్రంథాల వ్యాఖ్యానంలో సాటిలేనివారన్న విషయం ఎరిగిన మహావతార్ బాబాజీ క్రీస్తు బోధనలు మరియు శ్రీకృష్ణుడి బోధనలకు గల పోలికను వివరిస్తూ ఒక చిన్న పుస్తకం వ్రాయమని శ్రీయుక్తేశ్వర్ ను కోరారు. అందుకాయన “ద హొలీ సైన్స్” (కైవల్యదర్శనం) అన్న గొప్ప పుస్తకంలో వాటిని విశదీకరించారు. ఇది 1894 లో ప్రచురితమైనది.
“రాజతేజో విరాజమానులైన మా గురుదేవుల మనస్సు కీర్తిమీద కాని, లౌకిక లబ్దిమీద కాని కేంద్రీకరించి ఉండి ఉంటే ఆయన సులువుగా ఒక రాజాధిరాజో, ప్రపంచాన్ని గడగడలాడించే యోధుడో అయి ఉండేవారని” యోగానంద తరచు అనుకుంటూ ఉండేవారు. “వాటి బదులు ఆయన కోపం, అహంభావం అనే ఆంతరిక దుర్గాల్ని కూలగొట్టడానికి పూనుకున్నారు; వాటి పతనమే మానవుడి ఔన్నత్యానికి నిదర్శనం.” మరింత సమాచారం కోసం సందర్శించండి: yssofindia.org
