తెలంగాణ హైకోర్టుకు దిశ కమిషన్ నివేదిక
హైదరాబాద్: దేశవ్యాప్తంగా దిశ అత్యచారం.. నిందితుల ఎన్‌కౌంటర్ సంచలనం రేపింది. దిశ నిందితులను రోజుల వ్యవధిలోనే పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఎన్‌కౌంటర్ పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మానవహక్కుల సంఘం ఈ ఘటనపై విచారణ జరిపింది. దిశ కేసులో నిందితులను పోలీసులే కాల్చి చంపారని సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్ కమిషన్ నిర్ధారించింది. దిశ కమిషన్ నివేదిక తెలంగాణ హైకోర్టుకు చేరింది. నివేదికపై అభిప్రాయాలను హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టుకు దిశ కేసు చేరింది. దిశ కేసులో అమికస్ క్యూరీగా దేశాయ్ ప్రకాష్‌రెడ్డిని హైకోర్టు నియమించింది. నిందితులకు తమకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు చెబుతున్న కథనం బూటకమని సిర్పుర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. చంపే ఉద్ధేశంతోనే వారిపై కాల్పులు జరిపారని కమిషన్ స్పష్టం చేసింది. బూటకపు ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన పది మంది పోలీసు అధికారులపై ఐసీపీ 302, 201, 34 సెక్షన్ల కింద హత్యానేరం కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది.
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
భీమవరం: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి అని కొనియాడారు. యావత్ భారతానికి అల్లూరి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి ఎంతోమంది మహనీయులు ఇక్కడ పుట్టారని గుర్తుచేశారు. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు అయిందని తెలిపారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మోదీ ప్రకటించారు. మన్యం వీరుడిగా ఆంగ్లేయులతో వీరోచితంగా అల్లూరు పోరాడారని, మనమంతా ఒకటేనన్న భావనతో ఉద్యమం జరిగిందని మోదీ పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా మన్యం జిల్లాల అభివృద్ధి చేస్తామన్నారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, మాతృభాషలో విద్య కోసం 750 ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటయ్యాయని మోదీ తెలిపారు.
