ఒక్క ఎమ్మెల్యేను కూడా టచ్ చేయలేరు: గంగుల
కరీంనగర్: ‘కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు.. కనీసం ఒక్క టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను కూడా టచ్ చేయలేరు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు’ అని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. కేసీఆర్ నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా వేరు చేయలేరని, ముందు మీకున్న ముగ్గురు ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని హెచ్చరించారు. బీసీలంటే బీజేపీకి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. 32 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు 1200 కోట్లకు మించి కేటాయించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలోని 2,950 రైసుమిల్లులు 28 రోజులుగా మూతపడి లక్షలాది కుటుంబాలు ఉపాధిలేక రోడ్డునపడితే ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్‌కు ఒక్క రూపాయి అయినా అడిగావా అని గంగుల కమలాకర్ ప్రశ్నించారు.
