హుస్సేన్ సాగర్‌లో ముగిసిన ‘అస్మిత’ మహిళా కయాకింగ్ & కెనోయింగ్ సిటీ లీగ్

హుస్సేన్ సాగర్‌లో ముగిసిన ‘అస్మిత’ మహిళా కయాకింగ్ & కెనోయింగ్ సిటీ లీగ్

ఆర్.బి.ఎం,హైదరాబాద్: తెలంగాణ కయాకింగ్ మరియు కెనోయింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ అస్మిత’ మహిళా కయాకింగ్ మరియు కెనోయింగ్ సిటీ లీగ్ పోటీలు ఆదివారంతో విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన గల ‘శాట్’ వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌లో జనవరి 31 నుండి ఫిబ్రవరి 1 వరకు ఈ పోటీలు జరిగాయి. ఈ క్రీడా సంబరంలో వివిధ ప్రాంతాల నుండి సుమారు 70 మంది సబ్-జూనియర్ బాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. తెలంగాణ కయాకింగ్ మరియు కెనోయింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల చారి, సెక్రటరీ రామకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలలో క్రీడాకారిణులు 500 మీటర్లు మరియు 200 మీటర్ల విభాగాలలో పోటీ పడ్డారు. ముఖ్యంగా కయాకింగ్ సింగిల్, కెనో సింగిల్, కయాకింగ్ డబుల్ మరియు కెనో డబుల్ ఈవెంట్లలో బాలికలు ప్రదర్శించిన నైపుణ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వాటర్ స్పోర్ట్స్ పట్ల మహిళా క్రీడాకారుల్లో ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా ఈ లీగ్ నిర్వహించబడింది. ముగింపు వేడుకలకు గిరిజన సంక్షేమ క్రీడా అధికారి , గిరిజన సంక్షేమ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ పాఠశాల ప్రిన్సిపాల్ మరియు వర్ధన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విజేతలకు బహుమతులు అందజేస్తూ.. గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల క్రీడాకారిణులు వాటర్ స్పోర్ట్స్‌లో జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళా క్రీడాకారులకు ఇలాంటి వేదికలు కల్పించడం ద్వారా ఒలింపిక్ క్రీడల్లో తెలంగాణ సత్తా చాటే అవకాశం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *