భగవంతుడి స్వరమే గురువు
హైదరాబాద్: గురువు అంటే బోధించి, నడిపించే లేక నేర్పించే ఒక వ్యక్తి అని చాలామంది భావిస్తారు. అయితే ఒక ఆధ్యాత్మిక గురువు ఇంతకంటే చాలా ఎక్కువ. ‘గురువు’ అన్న పదం రెండు భాగాలు కలిగి ఉంటుంది. ‘గు’ అంటే అంధకారం, ‘రు’ అంటే నిర్మూలించువాడు లేక తొలగించువాడు అని అర్థం. సరళమైన పదాలలో చెప్పాలంటే మనలోని ఆధ్యాత్మిక అంధకారాన్ని జయించడానికి మనకు సహాయపడి జ్ఞానం వైపు నడిపించే వాడు ‘గురువు.’ తాను దైవ సాక్షాత్కారాన్ని పొంది మనలను అంతిమ సత్యం వైపు నడిపించగలిగేవాడు సద్గురువు.
నిజమైన జ్ఞానం కోసం మనలోని తపన, భగవంతుడితో మన సంబంధం గాఢతరమైనప్పుడు, క్లిష్టమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు మార్గదర్శకత్వం వహించడానికి ఒక దివ్యవాహకం లేదా గురువును పంపడం ద్వారా భగవంతుడు మనకు సమాధానం ఇస్తాడు. అటువంటి గురువు దైవం చేత నియమింపబడిన వాడే కానీ తక్కువ కాదు. ఆయన భగవంతుడితో ఏకత్వం పొంది, ఈ భూమిపై ఆయన ప్రతినిధిగా మాట్లాడడానికి అనుమతి పొంది ఉన్నవాడు. గురువు అంటే మౌనంగా ఉండే భగవంతుడి మాట్లాడే స్వరం.

పరమహంస యోగానంద అటువంటి పూజ్యులైన ఆధ్యాత్మిక గురువు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల జీవితాలను పరివర్తనం చెందించిన కాల ప్రభావం లేని ఆధ్యాత్మిక గ్రంథరాజమైన “ఒక యోగి ఆత్మకథ” ను రచించిన వారు. ఈ అద్భుత గ్రంథపుటల్లో ఆయన దివ్యులైన తమ గురువు — స్వామి శ్రీయుక్తేశ్వర్ ప్రేమపూర్వకమయినప్పటికీ కఠినతరమైన — శిక్షణలో దైవసాక్షాత్కారాన్ని సాధించిన తన ఆధ్యాత్మిక మార్గాన్ని వర్ణిస్తారు.
ఆయన ఇలా అంటారు, “గురుశిష్యుల మధ్య ఉండే సంబంధం ప్రేమ, స్నేహాల అత్యుత్తమ వ్యక్తీకరణ; పరస్పర ఏకైక లక్ష్యమైన “భగవంతుణ్ణి అన్నిటికన్నా అధికంగా ప్రేమించడం“అనే దానిపై ఆధారపడినది.
ఆధ్యాత్మిక మార్గంలో అహంకార ప్రేరిత అలవాట్లను జయించడం ద్వారా ప్రేమ, శాంతి, ఆనందాలను అలవరచుకోవడాన్ని గురువు శిష్యుడికి నేర్పుతారు. క్రియాయోగం వంటి శాస్త్రీయమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ద్వారా శిష్యుడి చైతన్యాన్ని ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలకు నడిపిస్తూ, ఈ జన్మలోనే గాని, లేక భవిష్యత్ జన్మల్లో గాని భగవంతుడిలోకి చేరుస్తారు. గురువు శిష్యులకు అత్యంత ఆత్మీయ నేస్తం, మరియు వారి శ్రేయోభిలాషి అయి, వారి మానసిక స్థితి అత్యల్ప స్థాయిలో ఉన్నా , లేక అత్యున్నతమై జ్ఞానం పొంది ఉన్న స్థితిలో ఉన్నా వారిని నిర్నిబంధంగా ప్రేమిస్తారు. అటువంటి గురువుకు గాఢమైన ప్రేమ, భక్తి, విధేయత, సమర్పణ భావాలను గురుపూర్ణిమ రోజు అర్పించుకుంటారు.
యోగానంద ఆత్మసాక్షాత్కారానికి అత్యున్నత మార్గమైన క్రియాయోగాన్ని, సంతులన జీవన కళను గురించిన తన బోధలను వ్యాప్తి చెందించడానికై 1917లో రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ (వై.ఎస్.ఎస్. ) ని, 1920 లో లాస్ ఏంజిలిస్ లో సెల్ఫ్-రియలైజెషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) నూ స్థాపించారు. ఆసక్తి ఉన్న అన్వేషకులు ఆత్మసాక్షాత్కారం కోసం గృహ-అధ్యయన పాఠాలను యోగదా ఆశ్రమాల ద్వారా పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒక సాధారణ భక్తుడు గురువు లేనిదే భగవంతుడిని కనుగొనలేడని యోగానంద అన్నారు. భక్తుడు గురువు నేర్పిన ధ్యాన సాధనాల అధ్యయనం ద్వారా స్వప్రయత్నం చెయ్యాలి, అది 25%; గురువు ఆశీర్వాదం వల్ల 25% చేకూరుతుంది; అప్పుడు భగవంతుడి కృప వల్ల 50% లభ్యమౌతుంది.
గురువు తన భౌతిక శరీరంలో లేనప్పటికీ ఆయన తన శిష్యుల క్షేమం గురించి అంతే శ్రద్ధ కలిగి ఉంటారు. ఆయన బోధనలే అప్పుడు గురువుగా పని చేస్తాయి, కనుక ఆయన అనుయాయులు వాటి ద్వారా ఆయనతో అనుసంధానంలో ఉంటారు. గురువు ఎప్పుడూ తన శిష్యులను గమనిస్తూనే ఉండి, వారు గాఢమైన భక్తితో ఎప్పుడైనా తనను పిలిస్తే వారికి అండగా నిలుస్తారు.
గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి లోని పద్మశాలి కళ్యాణ మండపంలో యోగదా సత్సంగ సొసైటీ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. పరమహంస యోగానంద భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వైఎస్ఎస్ హైదరాబాద్ ధ్యానకేంద్రం కమిటి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ధ్యానంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన ప్రసాదం, రెండుంబావు నుంచి భజనలుంటాయి. సాయంత్రం 4 గంటలనుంచి 6 వరకు ధ్యానంతో పాటు ఇతర కార్యక్రమాలు వుంటాయి. మరిన్ని వివరాలకు 7093720623, 9866440837 నంబర్లకు ఫోన్ చేయవచ్చని కమిటీ సభ్యులు సూచించారు.
మరింత సమాచారం కోసం:yssi.org
