ఘనంగా పరమహంస యోగానంద జయంతి ఉత్సవాలు

ఘనంగా పరమహంస యోగానంద జయంతి ఉత్సవాలు

హైదరాబాద్: యోగదా సత్సంగ్ సొసైటీ / సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు పరమహంస యోగానంద 130వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.

హైదరాబాద్ బేగంపేటలోని వైఎస్ఎస్ ధ్యాన కేంద్రంలో యోగానంద ఆవిర్భావ దినోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ, గాడ్ టాక్స్ విత్ అర్జున తదితర పుస్తకాలపై 25% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు. తెలంగాణ నలుమూలల నుంచీ వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

*ఆధ్యాత్మిక రైలింజన్ పరమహంస యోగానంద*

అత్యంత స్ఫూర్తిదాయకంగా ప్రభావశీలమైన శ్రీ శ్రీ పరమహంస యోగానంద జీవితం
(130 వ జన్మదిన ప్రత్యేకం)

“చిట్టితల్లీ, నీ కొడుకు యోగి అవుతాడమ్మా! ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా ఇతను, ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిద్ధ్యానికి చేరుస్తాడు.” ఈ అమరమైన వాక్కులతో పరమహంస యోగానందుల వారి పరమ గురువైన శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు అప్పటికింకా తన తల్లి ఒడిలో పసి బిడ్డడే అయిన బాల ముకుందుడి భవిష్యత్ ఆదర్శ మార్గాన్ని గురించి జోస్యం చెప్పారు.

యోగానంద అనేది ముకుందుడు కాషాయ వస్త్రాలను ఎంచుకొన్నపుడు తన గురువు శ్రీ స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి ప్రసాదించిన సన్న్యాసాశ్రమ నామం. అప్పటికి ఏళ్లతరబడి సైనిక శిక్షణ వంటి కఠినమైన శిక్షణను ఆయన తన గురువు దగ్గర పొందారు.

తమ కలకత్తా నివాసానికి సమీపంలోని శ్రీరాంపూర్ లో ఉన్న తమ గురువు ఆశ్రమంలో ఒక సన్యాసాశ్రమ శిక్షణార్థిగా తాను గడిపిన జీవితాన్ని గురించిన ఆహ్లాదకరమైన వివరణను యోగానంద తమ ”ఒక యోగి ఆత్మకథ” పుస్తకంలోని “గురుదేవుల ఆశ్రమంలో గడచిన కాలం” అనే స్ఫూర్తిదాయకమైన అధ్యాయంలో వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా యోగానంద జన్మదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 5న జరుపుకొంటారు. పశ్చిమ దేశాల్లో యోగధ్యానానికి రాయబారి వంటి ఈ గొప్ప గురువులు దాదాపు 30 ఏళ్ళకు పైగా సనాతన భారతదేశపు ఆధ్యాత్మిక బోధనలను అందించడానికి అమెరికాలో ఉండిపోయారు.

క్రియయోగ మార్గం ఒక సమగ్ర జీవన విధానం, ఆత్మసాక్షాత్కారానికి ‘విమాన మార్గం’గా చెప్పబడింది. యోగానంద అనుయాయులు ఆయన క్రియాయోగ సంబంధిత బోధనలను అనుసరించి అపరిమితమైన లాభాన్ని పొందారు. ఈ వ్యాస రచయిత స్వయంగా యోగానంద బోధలు తనలో పూర్తి పరివర్తనం కలిగించాయని ప్రమాణం చేసి చెప్పగలడు.

యోగానంద 1952లో తన శరీరాన్ని వదిలివేయగా, ఆయన బోధనలను వ్యాప్తి చెందించే కార్యభారం ఆయన స్థాపించిన జంట సంస్థలైన — యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా(వై.ఎస్.ఎస్), మరియు ప్రపంచవ్యాప్తంగా సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్) లపై ఉన్నది.

యోగానంద జీవితంలో, ఆయన వ్యక్తిత్వంలో ప్రతిఫలించిన స్వచ్ఛమైన ప్రేమ, శాంతి, మరియు ఆనందంతో ప్రభావితులైన అనేక మంది అనంతాన్ని చేరుకోవడానికి ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తున్నారు. యోగానంద మూర్తీభవించిన ప్రేమస్వరూపులు కావడం వల్ల ‘ప్రేమావతారులు’గా నేటికీ పిలవబడుతున్నారు.

యోగానంద శిష్యులైన వారిలో లూథర్ బర్బాంక్, అమెలిటా గల్లి-కుర్చి వంటి ప్రముఖ వ్యక్తులు ఉండగా, గురుదేవుల దేహత్యాగం తరువాత ఆయన బోధలకు గాఢంగా ప్రభావితులైన వారిలో ఎందరికో ఆరాధ్యులైన జార్జ్ హారిసన్, పండిత రవిశంకర్, స్టీవ్ జాబ్స్ వంటి వారున్నారు.

1952లో తాను ఈ భూమిని విడిచి పై లోకాలకు తరలిపోయేనాటికి తనలోని దివ్యప్రేమ అనే శక్తివంతమైన సందేశం ద్వారా ఈ ప్రపంచంపై ఆయన సూక్ష్మరీతిలోను, ప్రత్యక్షంగానూ కూడా ప్రభావం చూపారు. తన శిష్యులకు ఆయన స్పష్టమైన రీతిలో ఇచ్చిన సందేశం ఏమిటంటే — మిగిలినవన్నీ ఆలస్యం చెయ్యవచ్చు గాక; కానీ మీ దైవాన్వేషణను మాత్రం ఆలస్యం చెయ్యడానికి వీలులేదు.

ఆయన చేసిన విస్తారమైన రచనలలో ‘విస్పర్స్ ఫ్రమ్ ఎటర్నిటీ,’ ‘మెటాఫిజికల్ మెడిటేషన్స్,’ ‘సాంగ్స్ ఆఫ్ దసోల్’ వంటి ఉత్తమ గ్రంథాలున్నాయి. అనేకాలైన ఆయన ప్రసంగాలు ‘ఆత్మసాక్షాత్కారం వైపు ప్రయాణం,’ ‘దివ్య ప్రణయం,’ ‘మానవుడి నిత్యాన్వేషణ’ వంటి సంచికలుగా సంకలనం చేశారు.
ఇంట్లోనే ఉండి అధ్యయనం చేయగలిగే వై.ఎస్.ఎస్. – ఎస్.ఆర్.ఎఫ్. పాఠాలు సత్యాన్వేషకులందరికీ ధ్యాన ప్రక్రియలనే కాక, జీవించడం ఎలాగో నేర్పే కళను కూడా ఉపదేశిస్తూ అంచెలంచెలుగా మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి.

ఈ భూమిపై యోగానంద జీవన ప్రమాణం కొద్ది దశాబ్దాలకే పరిమితమయినా, ఆయన యొక్క ఏకాగ్ర దైవకేంద్రిత జీవనం వల్ల జనించిన శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాలు నేటికి మహాసాగరంవలె అయ్యాయి. ఆయన బోధనలు శ్రద్ధగా అనుసరించే శిష్యులు ఈ జీవితంలోనూ, మరణానంతరమూ కూడా గొప్ప భాగ్యశాలురవుతారు. మరింత సమాచారం కోసం: yssofindia.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *