మణికొండ ఇబ్రహీం చెరువులో గుర్రం డెక్క తొలగింపు పనులు వేగం..
ఆర్.బి.ఎం, డెస్క్ హైదరాబాద్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇబ్రహీం చెరువులో పాతుకుపోయిన గుర్రం డెక్క కారణంగా చెరువు నీరు కాలుష్యానికి గురై, దోమల వ్యాప్తితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల విన్నపం మేరకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి, గత రెండు వారాలుగా గుర్రం డెక్క తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నేడు చెరువు వద్దకు చేరుకుని జరుగుతున్న పనులను మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, డిఈ సంజయ్ స్వయంగా పరిశీలించారు. అధికారులు పనుల పురోగతిని సమీక్షిస్తూ, శుభ్రపరిచే కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసి చెరువును పూర్తిగా శుద్ధి చేయాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని, చెరువులో దోమల నియంత్రణ చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. స్థానికులు అధికారులు వెంటనే స్పందించి చెరువు శుభ్రపరిచే పనులు ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా చెరువు పరిశుభ్రతను కాపాడేలా చర్యలు కొనసాగించాలని కోరారు.
