అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక వ్యాసం
హైదరాబాద్: యోగాచరణను శ్రద్ధగా చేపట్టమని ఎవరైనా యువకుడిని ప్రోత్సహించినప్పుడు “యోగం నాకు ఎందుకు అంత ముఖ్యం?” అని అతడు అడగవచ్చు, అతని ప్రశ్నకు జ్ఞానపూర్వకంగా సమాధానం చెప్పాలంటే, మనకు ముందుగా సమాధానం తెలిసి ఉండాలి. ప్రతి సంవత్సరం, ఒక దశాబ్దం నుంచి, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, మన జీవితాలలో యోగాకు ఉన్న శాశ్వత ప్రాముఖ్యతను గుర్తించి ఉత్సవం జరుపుకోవడంలో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది. అయినప్పటికీ, మనలో కొందరికి తెలిసినట్లుగా, యోగం యొక్క నిజమైన అర్థం దాని అంతరికమూ, మరియు లోతైన వ్యక్తిగత వ్యక్తీకరణలో ఉంది. ప్రపంచంలోని అన్ని మతాలు నొక్కి వక్కాణించే దేవునితో ఏకత్వం కోసం మనం చేసే దివ్యమైన అన్వేషణను శాస్త్రీయ యోగ-ధ్యాన పద్ధతుల క్రమం తప్పని అభ్యాసం త్వరితం చేసి, అంతిమంగా సాధ్యం చేస్తుంది.
శ్రద్ధాళువైన యోగి జీవితంలో అత్యున్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పించే ఆధ్యాత్మిక సాధనా పద్ధతి క్రియాయోగం. శ్రీకృష్ణుడు తన శిష్యుడైన అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీతలో క్రియాయోగం గురించి రెండుసార్లు ప్రస్తావించారు. ఈ కీలకమైన, ఖచ్చితమైన విజ్ఞాన శాస్త్రాన్ని, శతాబ్దాల మానవ అజ్ఞానం తరువాత, పంతొమ్మిదవ శతాబ్దంలో, గొప్ప గురువైన లాహిరీ మహాశయులు, వారి గురుదేవులు మహావతార్ బాబాజీ ఆశీస్సులతో తిరిగి కనుగొన్నారు. ఆ తరువాత లాహిరీ మహాశయుల శిష్యులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి లోతైన ఈ క్రియాయోగ విజ్ఞానాన్ని పరమహంస యోగానందకు అందించారు.
యోగానంద, క్రియాయోగానికి ప్రపంచ రాయబారిగా బాధ్యతలు స్వీకరించి, దాని ప్రయోజనాలను పాశ్చాత్య ప్రపంచంలో విస్తృతంగా వ్యాప్తి చెందించారు. నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు లక్షలాది మంది, క్రియాయోగ మార్గంలో అంతర్లీనమై ఉండే యోగ ధ్యాన శాస్త్రీయ పద్ధతులను అభ్యసిస్తున్నారు.
యోగానంద ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన తన రచన ఒక యోగి ఆత్మకథలో వివరించారు. “మాయ లేక ప్రకృతికి వశవర్తులై ఉన్న మనుషులలో, ప్రాణశక్తి ప్రవాహం బాహ్యప్రపంచం వైపు ఉంటుంది; ఈ ప్రవాహాలు ఇంద్రియాలతో దుర్వినియోగమై వ్యర్థం అవుతాయి. క్రియాయోగ సాధన ప్రవాహాన్ని వెనుకకు మరలేలా చేస్తుంది; ప్రాణశక్తి మానసికంగా అంతర్గత విశ్వం వైపునకు మళ్ళించబడి వెనుబాములోని సూక్ష్మశక్తులతో పునరైక్యత పొందుతుంది. ఆ విధంగా ప్రాణశక్తి బలపడడంతో, యోగి శరీరం, మెదడు, కణాలు ఆధ్యాత్మిక అమృతంతో నవీకరించబడతాయి.”
శ్రద్ధాళువైన సాధకుడు క్రమం తప్పని క్రియాయోగాభ్యాసం ద్వారా తన రక్తాన్ని కర్బనరహితం చేసి ఆక్సిజన్ తో నింపగలుగుతాడని ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద రాశారు. మెదడు, వెన్నెముక ఈ అదనపు ఆక్సిజన్ ద్వారా పునరుజ్జీవనం పొందుతాయి. అంతేకాదు కణజాల క్షయం నిరోధించబడుతుంది. క్రియాయోగం ద్వారా వచ్చే శారీరక, మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఎంత చెప్పినా తక్కువే. జీవితాన్ని మెరుగుపరిచే ఈ ప్రక్రియ, దానిని శ్రద్ధగా సాధన చేసే యోగి అస్తిత్వాన్ని ఉన్నతస్థాయికి ఉద్ధరిస్తుంది.
క్రియాయోగం అభ్యాసం ద్వారా ఎవరైనా సాధారణ జీవనశైలిని అధిగమించి ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించవచ్చు. దాని లోతులను చేధించవచ్చు.
పరమహంస యోగానంద స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా క్రియాయోగ బోధనలతో లక్షలాదిమంది సాధకులు ప్రయోజనం పొందారు.
ఈ ప్రపంచంలో సాధారణ ప్రజలు కూడా క్రియాయోగం వంటి శాస్త్రీయ పద్ధతిని శ్రద్ధగాను, భక్తితోను చేపట్టినప్పుడే జీవితాన్ని సార్థకం చేసే ప్రభావాన్ని అనుభవించగలరు. మరింత సమాచారం కోసం: yssofindia.org
