లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హౌసింగ్ ఏఈ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హౌసింగ్ ఏఈ

● ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు కోసం రూ. 20 వేలు లంచం డిమాండ్

 ● ఇప్పటికే రూ. 10 వేలు ఇచ్చినా పని కాకపోవడంతో ఏసీబీకి ఫిర్యాదు

 ● మిగిలిన నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి

 ● ఏఈని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నగదు స్వాధీనం

ఆర్.బి.ఎం, నార్నూర్, ఆదిలాబాద్: పేదల సొంతింటి కల నిజం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కొందరు అధికారుల అవినీతి వల్ల అభాసుపాలవుతోంది. ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు చేసేందుకు లబ్ధిదారుడి నుండి లంచం డిమాండ్ చేసిన హౌసింగ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (AE) దుర్గం శ్రీకాంత్, బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నార్నూర్ మండలానికి చెందిన ఓ లబ్ధిదారుడు తన ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు చేయాలని ఏఈ శ్రీకాంత్‌ను ఆశ్రయించారు. అయితే, బిల్లు పాస్ చేయాలంటే రూ. 20,000 లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశారు. బాధితుడు ఇప్పటికే రూ. 10,000 చెల్లించినప్పటికీ, మిగిలిన డబ్బులు ఇస్తేనే పని అవుతుందని ఏఈ మొండికేయడంతో బాధితుడు గత్యంతరం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో నిఘా పెట్టారు. బుధవారం ఏఈ శ్రీకాంత్ బాధితుడి నుంచి మిగిలిన నగదు తీసుకుంటుండగా అధికారులు మెరుపు దాడి చేసి ఆయన్ను పట్టుకున్నారు. నిందితుడి నుంచి నగదును స్వాధీనం చేసుకుని, రసాయన పరీక్షలు నిర్వహించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు. అనంతరం ఏఈని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *