మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయానికి సహకరించండి
● ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ఆర్.బి.ఎం, యాదగిరిగుట్ట: రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు సిపిఐ ఉమ్మడి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్టలోని 12 వార్డులు మరియు ఆలేరులోని 12 వార్డుల్లో కాంగ్రెస్ – సీపీఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారానే పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆలేరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా ప్రతినిధులుగా తమ అభ్యర్థులను ఎన్నుకుంటే నిధుల మంజూరులోనూ, మౌలిక వసతుల కల్పనలోనూ వేగంగా ముందుకు వెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి పట్టం కట్టేలా ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మరియు సీపీఐ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
