యాదాద్రిలో బరితెగించిన అవినీతి.. లక్ష్మీనరసింహుడి సొత్తుకే కేటుగాళ్ల కన్నం!
● *పవిత్ర క్షేత్రంలో వీడని అవినీతి నీడ!*
● *యాదాద్రిలో రూ. 10 లక్షల విలువైన బంగారు, వెండి డాలర్లు అదృశ్యం*
● *ఈఓ పర్యవేక్షణలోని శాఖలోనే చోరీ జరగడం అధికారుల వైఫల్యం*
● *ఏడాది క్రితమే మాయమైనా, ఆడిట్ వరకు విషయాన్ని దాచిపెట్టారు*
● *చింతపండు చోరీ తర్వాత తాజాగా డాలర్ల స్కామ్ వెలుగులోకి*
● *ఆడిట్ తనిఖీల్లో లెక్కలు తేలకపోవడంతో దొంగతనం నిర్ధారణ*
● *రికవరీతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని భక్తుల డిమాండ్*
ఆర్.బి.ఎం, యాదాద్రి:యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అవినీతి వ్యవహారాలు భక్తులను విస్మయానికి గురిచేస్తున్నాయి. భక్తుల విరాళాలు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చే నిధులకు కొంతమంది అధికారులు, సిబ్బంది గండికొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో లడ్డూ ప్రసాదం తయారీలో వాడే చింతపండు చోరీ ఘటన మరువకముందే, తాజాగా ప్రచార శాఖలో విక్రయించే విలువైన బంగారు, వెండి డాలర్లు మాయమవ్వడం సంచలనం సృష్టిస్తోంది. సుమారు రూ. 10 లక్షల విలువైన ఈ డాలర్లు దాదాపు ఏడాది క్రితమే అదృశ్యమైనట్లు తెలుస్తుండగా, ఇటీవల జరిగిన ఆడిట్ అధికారుల తనిఖీల్లో ఈ అక్రమం అధికారికంగా బయటపడింది. స్వామివారి ప్రతిమతో కూడిన ఈ డాలర్ల విక్రయం గత 20 ఏళ్లుగా కొనసాగుతుండగా, మధ్యలో కొంతకాలం నిలిపివేశారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం వీటిని పునఃప్రారంభించినప్పటి నుంచి, దేవస్థాన ఈఓ పర్యవేక్షణలో ఏఈఓ ఆధీనంలో ఉండే ప్రచార శాఖ వీటి బాధ్యతలను చూస్తోంది. ఆలయానికి వచ్చే బంగారం, వెండిని మింట్ కంపౌండ్ ద్వారా డాలర్లుగా మార్పించి భద్రపరుస్తారు. కానీ, తాజాగా జరిగిన తనిఖీల్లో లెక్కలు తేలకపోవడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై దేవస్థాన డీఈఓ దోర్బల భాస్కర్ స్పందిస్తూ, బాధ్యుల నుంచి సదరు మొత్తాన్ని రికవరీ చేస్తామని మరియు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
