మహావతార్ బాబాజీ – సదా ప్రేరణనందించే మహాత్ముడు
“ఎప్పుడయినా, ఎవరయినా భక్తితో బాబాజీ పేరు ఉచ్చరించినట్టయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది.” అన్నారు లాహిరీ మహాశయులు.
మహాగురువు లాహిరీ మహాశయుల ఈ విశిష్టమైన ఉటంకింపును, పరమహంస యోగానంద తమ ‘ఒక యోగి ఆత్మకథ’లో పేర్కొన్నారు. ఇది మహావతార్ బాబాజీ అపారమైన అతీంద్రియ ప్రాముఖ్యతను, నిజాయితీగా తనను అనుసరించేవారందరి జీవితాలపై ఆయన చూపే కాలాతీత ప్రభావాన్ని శక్తివంతంగా వివరిస్తుంది. లాహిరీ మహాశయుల ఉత్కృష్ట శిష్యులైన స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి చెప్పినట్లు, బాబాజీ ఆధ్యాత్మిక స్థితి మానవావగాహనకు అందనిది. అయినప్పటికీ, సామాన్య ప్రజలు మహాగురువుల స్ఫూర్తి, బోధనలతో అనుసంధానంలో ఉండడానికి తమ జీవితాలలో ప్రయత్నిస్తే, వారు తమ ఆధ్యాత్మిక ప్రయాణాలలో విపరీతంగా ప్రయోజనం పొందుతారు.
అజరామర గురువుగా ప్రసిద్ధి చెందిన మహావతార్ బాబాజీ స్మృతి దివస్ లేదా సంస్మరణ దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 25న యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) భక్తులు ప్రపంచవ్యాప్తంగా సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) సభ్యులు జరుపుకుంటారు.
ఆధ్యాత్మికోన్నతిని కలిగించే క్రియాయోగ మార్గానికి చెందిన బోధనలను మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి, 1917లో వై.ఎస్.ఎస్.ను స్థాపించిన పరమహంస యోగానంద ప్రపంచానికి అందించారు. ఆధునిక యుగంలో భారతదేశపు ప్రాచీన ‘క్రియాయోగ’ బోధనలను పాశ్చాత్య ప్రపంచానికి వ్యాప్తి చేయడానికి బాబాజీ… యోగానందను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నారు. లాహిరీ మహాశయులకు ‘క్రియాయోగ’ శాస్త్రజ్ఞానాన్ని ప్రసాదిస్తూ , ఆయన అభ్యర్థన మేరకు, ఈ పవిత్రమైన, రహస్యమైన పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిజాయితీగల సత్యాన్వేషకులందరికీ బోధించడానికి బాబాజీ ఆయనకు అనుమతించారు. ‘ఒక యోగి ఆత్మకథ’ పుటల నుండి, బాబాజీకి లాహిరీ మహాశయుల ఉన్న శాశ్వత ప్రేమ గురించి, అనగా గురువుకు తన శిష్యుడి పట్ల జన్మజన్మలకు, అనంతకాలం వరకూ ఉండే ప్రేమ గురించి కూడా మనం తెలుసుకుంటాం.
హిమాలయాలలో వారి చారిత్రాత్మక సమావేశంలో బాబాజీ లాహిరీ మహాశయులతో ఇలా అన్నారు, “తల్లిపక్షి తన పిల్లలను కాపాడుకుంటూ ఉన్నట్టుగా- చిమ్మచీకటిలో, తుఫానులో, అల్లకల్లోలంలో, వెలుగులో, నేను నీ వెనకాలే ఉంటూ వచ్చాను.” దానికి లాహిరీ మహాశయులు నిశ్చేష్టులై, అయినప్పటికీ తమ గురువు మహోన్నతమైన కాంతి పరివేషంలో పూర్తిగా మునిగినవారై ఇలా ప్రత్యుత్తరమిచ్చారు, “గురుదేవా, ఏం చెప్పగలను నేను? ఇటువంటి అమరప్రేమ గురించి ఎక్కడయినా, ఎవ్వరయినా విన్నారా?”
‘ఒక యోగి ఆత్మకథ’ పుటలు ఈ విధంగా నిజమైన గురువుకు, సంసిద్ధుడైన శిష్యుడికి మధ్య ఉన్న బంధం అపారతను, అనంతత్వాన్ని మన కళ్ళకు, హృదయాలకు, ఆత్మలకు వెల్లడిచేస్తాయి. పరమహంస యోగానంద తన గురువు శ్రీ యుక్తేశ్వర్ నుండి తన పరమ గురువుల నుండి జీవితాన్ని వృద్ధి చేసే, ఆత్మను విముక్తి చేసే ‘క్రియాయోగ’ జీవన విధానాన్ని వారసత్వంగా పొందారు.
వై.ఎస్.ఎస్. ఆఫ్ ఇండియా ఈ బోధనల ఆధారంగా వివరణాత్మక “జీవించడం ఎలా” పాఠాలను కూడా ప్రచురిస్తుంది. వాటిని ముద్రిత రూపంలో, డిజిటల్ రూపంలో కూడా సభ్యులందరికీ అందుబాటులోకి తెస్తుంది. ధ్యానం ప్రాథమిక ఉన్నత ప్రక్రియలు పాఠాల ద్వారా వై.ఎస్.ఎస్. సన్యాసులచే నిర్వహించబడే ప్రత్యేక తరగతుల ద్వారా, సమావేశాలలో లేదా సంగమాలలో, భారతదేశం నలుమూలల ఉన్న ప్రాంతాలకు సన్యాసుల సందర్శనల సమయంలో బోధించబడతాయి.
తద్వారా యోగ ధ్యానం యొక్క సర్వశక్తిమంతమైన, అయినప్పటికీ సులభంగా అందుబాటులో ఉండే, శాస్త్రీయ పద్ధతుల ఉనికిని తెలుసుకోవడానికి మరియు నేర్చుకోవడానికి లక్షలాది మంది స్ఫూర్తి పొందారు. ఇవి మహాగురువుల నుండి నిజాయితీగల భక్తులందరికీ అందించబడ్డాయి. మహావతార్ బాబాజీ స్వయంగా మరచిపోలేని విధంగా ఇలా అన్నారు, “ప్రపంచంలో కూడా, వ్యక్తిగత ప్రయోజనోద్దేశ్యం కాని అనుబంధం కాని లేకుండా తన బాధ్యతలను నిష్ఠగా నిర్వహించే యోగి, నిశ్చయమైన ఆత్మజ్ఞానమార్గంలో పయనిస్తాడు.” ‘ఒక యోగి ఆత్మకథ’ పుటల నుండి మనం ఇంకా ఈ సాగరమంత, శిల వంటి దృఢమైన హామీని పొందుతాము, “బాబాజీ, తమ లక్ష్యం వైపు ప్రయాణిస్తున్న నిజాయితీగల క్రియాయోగులందరినీ కాపాడటానికి, మార్గనిర్దేశం చేయడానికి వాగ్దానం చేశారు.”
మరింత సమాచారం కోసం: yssofindia.org
