తహసీల్దార్‌గా నువ్వు అన్‌ఫిట్‌.. మర్యాల గ్రామ సర్పంచ్‌పై కేసు నమోదు..

తహసీల్దార్‌గా నువ్వు అన్‌ఫిట్‌.. మర్యాల గ్రామ సర్పంచ్‌పై కేసు నమోదు..

ఆర్.బి.ఎం యాదాద్రి:తహసీల్దార్‌గా నువ్వు అన్‌ఫిట్‌… కల్వర్టును వెంటనే ఎందుకు తొలగించవు’ అంటూ మహిళా తహసీల్దార్‌ను దూషించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామ సర్పంచ్‌పై కేసు నమోదు చేశారు. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలోని ఈదుల చెరువు అలుగు పోసిన సమయంలో ఆ నీరు సర్వేనెంబర్‌ 614లోని ప్రభుత్వ భూమిలో నిలుస్తుంది. ఇదే సర్వేనెంబర్‌లో నిర్మించిన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డులోకి నీరు వస్తున్నందున, దాని ముందు ఉన్న కల్వర్టు కట్టను తొలగించాలని సర్పంచ్‌ కుర్మిండ్ల దామోదర్‌గౌడ్‌ జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పథికి ఈ నెల 27వ తేదీన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామస్థులతో సమీక్షించి ఎలాంటి వివాదాలు లేకుండా సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవో సరిత, తహసీల్దార్‌ పద్మాసుందరిని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కల్వర్టును తొలగించాలని సర్పంచ్‌ కోరుతుండగా, మరికొంతమంది గ్రామస్థులు నిరాకరిస్తున్నారు. దీంతో సర్పంచ్‌ దామోదర్‌గౌడ్‌ తహసీల్దార్‌నుద్ధేశించి మాట్లాడుతూ అధికారులు వస్తూ పోతూ తాత్సారం చేస్తున్నారని, కల్వర్టును వెంటనే ఎందుకు తొలగించవని, తహీసీల్దార్‌/ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ర్టేట్‌గా నువ్వు అన్‌ఫిట్‌ అన్నారు. పదజాలంతో సర్పంచ్‌ తనను దూషించారని, విధులకు ఆటంకం కలిగించినందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ పద్మాసుందరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ్‌ దామోదర్‌గౌడ్‌పై కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *