క్రియాయోగాన్ని విశ్వ వ్యాపితం చేసిన పరమహంస యోగానంద (132వ జన్మోత్సవ ప్రత్యేక కథనం)

క్రియాయోగాన్ని విశ్వ వ్యాపితం చేసిన పరమహంస యోగానంద (132వ జన్మోత్సవ ప్రత్యేక కథనం)

హైదరాబాద్:దైవభక్తి కలిగిన బెంగాలీ దంపతులు జ్ఞానప్రభ, భగవతి చరణఘోష్ లకు 1893 సంవత్సరం, జనవరి 5 న యోగానంద (పూర్వనామం ముకుందలాల్ ఘోష్ )— గోరఖ్ పూర్ లో జన్మించారు. పసిబాలుడైన ముకుందుడిని తన చేతుల్లో పెట్టుకొని తన గురువైన లాహిరీ మహాశయులను సందర్శించిన జ్ఞానప్రభతో… “చిట్టితల్లీ నీ కొడుకు యోగి అవుతాడమ్మా! ఆధ్యాత్మిక రైలింజను మాదిరిగా ఇతను, ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు“ అని ఆయన దీవించారు. ఆ తరువాతి కాలంలో ఆ భవిష్యద్వాణి సత్యమైంది.

బాలుడుగా ఉన్న ముకుందుడు కాళికాదేవిని గాఢంగా ప్రార్థిస్తూ, ధ్యానించేవాడు. అలా గాఢమైన భక్తిభావనలో మునిగి ఉన్న ఒకానొక సందర్భంలో ఒక బ్రహ్మాండమైన కాంతిపుంజం అతడి అంతర్ దృష్టికి గోచరమైంది. ఆ దివ్యతేజాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనై ఈ అద్భుత ప్రకాశం ఏమిటి? అని అతడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు “నేను ఈశ్వరుణ్ణి, నేను వెలుతురును” అని ఆ దివ్యవాణి సమాధానమిచ్చింది. ఈ ఆధ్యాత్మిక అనుభవం గురించి తన ఆత్మకథ ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద ఇలా రాశారు. “మెల్లగా కరిగిపోతున్న పరమానంద పారవశ్యంలో, భగవంతుణ్ణి అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించింది నాకు.”

1910లో పదిహేడేళ్లప్పుడు, ఈశ్వరుడికోసమై అన్వేషణతో అయన తన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించారు. ఆ అన్వేషణ ఆయనను తన గురువు స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి దగ్గరకు చేర్చింది. తన గురువు ప్రేమపూర్వకము, అయినా కఠినమైన శిక్షణలో ఆయన స్వామి సాంప్రదాయంలో పవిత్రమైన సన్యాస దీక్ష స్వీకరించారు. ఆవిధంగా, యోగానందగా సన్యాస నామముతో, దైవానుసంధానంలో ఉత్కృష్ట పరమానంద స్థితిని సూచించే పరమహంసగా మారారు.

1917 లో ఆయన రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) నూ, 1920 లో లాస్ ఏంజలీస్ లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) నూ స్థాపించారు. ఈ రెండు సంస్థల ప్రధాన లక్ష్యం జీవితపు అత్యున్నత లక్ష్యం — ఆత్మ పరమాత్మతో ఏకత్వం పొందడానికి ఉపకరించే — ప్రాచీన ఆధ్యాత్మిక విజ్ఞానమైన “క్రియా యోగ“ ధ్యాన ప్రక్రియలను వ్యాప్తి చేయడం. ఆసక్తి గల సాధకులు ఈ మహాగురువు రచించిన ఈ పవిత్రబోధనలను వై.ఎస్.ఎస్. ఆశ్రమాలనుండి గృహ-అధ్యయన పాఠాలుగా పొందవచ్చు.

తాను అమెరికాలో ఉండగా పరమహంస యోగానంద పైన చెప్పబడిన భారతీయ ఆధ్యాత్మిక సాధనల జ్ఞానాన్ని వ్యాప్తి చెందించడానికి అలుపెరగని కృషి చేయగా, ప్రజల నుండి మంచి ప్రతిస్పందన వచ్చింది. ఈశ్వరుడి కోసమైన తన తపనను అందరితో పంచుకోవాలన్న ఆకాంక్షతో అందరిచే ఎంతగానో శ్లాఘించబడిన ఆధ్యాత్మిక గ్రంథరాజం “ఒక యోగి ఆత్మకథ” ను రచించారు. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక వ్యక్తులపై గాఢమైన ప్రభావం చూపించిన ఈ పుస్తకం 50 భాషలలోకి అనువదించబడింది.

విస్తృతమైన ఆయన బోధనల పరిధిలోకి ఎన్నో విషయాలు, ప్రధానంగా 1) మానవ చైతన్యపు గ్రాహ్యతా స్థాయిని ఉన్నత స్థాయులకు చేర్చే శ్రేష్ఠమైన రాజయోగ ప్రక్రియ అయిన క్రియాయోగ ధ్యాన విజ్ఞానం నేర్పడం, 2) అన్ని నిజమైన మతాలలో లోతుగా వేళ్లూనుకొని ఉన్న ఏకత్వాన్ని ప్రబోధించడం 3) భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమంతో నిండి ఉండే సామరస్యపూర్వక జీవనాన్ని సాధించడానికి మార్గాలు చూపడం మొదలైనవి వస్తాయి. తద్వారా అవి లక్షలాది ప్రజలపై గాఢమైన ప్రభావం చూపించాయి.

పూజ్యులైన ఈ జగద్గురువు అత్యంత ప్రభావశీలురైన భారతదేశ ప్రాచీన ఆధ్యాత్మిక బోధనల రాయబారులలో ఒకరుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.ఆయన జీవితమూ, బోధలూ కూడా జాతి, సంస్కృతి, విశ్వాసాలతో సంబంధం లేకుండా వివిధ జీవన రీతుల ప్రజలలో ప్రేరణా, ఉద్దీపన పెంపొందించే శాశ్వత నీటి చెలమ వలె ఉపకరిస్తాయి.

మరింత సమాచారం కోసం: yssi.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *