రామకృష్ణ మఠం లో ఘనంగా సంప్రీతి దివస్ వేడుకలు…
స్వామి వివేకానందను స్మరిస్తే 20 రెట్ల శక్తి…
హైదరాబాద్: జ్ఞానం, భక్తి, సేవ ద్వారా వికసిత భారత్ సాధ్యమని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద చెప్పారు. అమెరికా చికాగో విశ్వమత మహాసభల్లో స్వామి వివేకానంద ప్రసంగించి 131 సంవత్సరాలైన సందర్బంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలో జరిగిన సంప్రీతి దివస్ కార్యక్రమంలో స్వామి బోధమయానంద మాట్లాడారు. స్వామి వివేకానంద సాహిత్య పఠనంతో పవిత్రత, సహనం, పట్టుదల పెరుగుతాయన్నారు. స్వామి వివేకానంద అమెరికా వెళ్లేముందు 1893 ఫిబ్రవరి లో వారంరోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించి సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ లో ఫిబ్రవరి 13 న తన జీవితంలో తొలి ప్రసంగం చేశారని బోధమయానంద గుర్తుచేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన ఇల్ల్యుమైన్ నాలెడ్జి రిసోర్సెస్, సీ.ఈ.ఓ శ్రీనివాస్ వెంకటరామన్ మాట్లాడుతూ స్వామి వివేకానంద సాహిత్యాన్ని చదవడం మాత్రమే కాకుండా అధ్యయనం చేయాలని యువతకు సూచించారు. ఇలా చేయడం ద్వారా ప్రతీఒక్కరు తమలోని శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడమే కాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పారు.
సంప్రీతి దివస్ లో భాగంగా ట్యాంక్ బండ్ పై ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రామకృష్ణ మిషన్, మఠం ఉపాధ్యక్షుడు స్వామి సుహితానంద ప్రసంగించారు. స్వామి వివేకానందాను స్మరిస్తే ఇరవైరెట్ల శక్తి ఉద్భవిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా స్వామి వివేకానంద చికాగో ప్రసంగ పాఠాన్ని వివేకానంద వాణి సంస్థ డైరెక్టర్ స్వామి శితికంఠానంద చదివి వినిపించారు. ఈ సందర్బంగా రామకృష్ణ మఠం స్వాములు, వాలంటీర్లు, ఎన్.సీ.సీ క్యాడెట్ లు, విద్యార్థినీ విద్యార్థులు స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ట్యాంక్ బండ్ నుంచి రామకృష్ణ మఠం వరకు ర్యాలీ నిర్వహించారు.