కామ క్రోధాలను జయిస్తేనే నిజమైన స్వాతంత్ర్యం – స్వామి బోధమయానంద

కామ క్రోధాలను జయిస్తేనే నిజమైన స్వాతంత్ర్యం
– స్వామి బోధమయానంద

హైదరాబాద్ (ఆగస్ట్ 15) : కామ క్రోధాలను జయిస్తేనే నిజమైన స్వాతంత్ర్యం లభించినట్లని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలో నిర్వహించిన లవ్ ఇండియా సర్వ్ ఇండియా కార్యక్రమంలో స్వామి బోధమయానంద ప్రసంగించారు. కామాన్ని జ్ఞానమనే ఖడ్గంతో జయించాలని ఆయన అన్నారు. ఇంద్రియాల నుంచి స్వాతంత్ర్యం పొందితేనే నిజమైన స్వాతంత్ర్యం లభించనట్లు అవుతుందని అన్నారు. మొబైల్ ఫోన్ ల నుంచి కూడా స్వాతంత్ర్యం పొందాలని ఆయన సూచించారు. చెడు ఆలోచనల నుంచి సదాలోచనల వైపు మరలాలని యువతకు స్వామీజీ సూచించారు. ‘‘లవ్ ఇండియా సర్వ్ ఇండియా’’అని స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని యువత సన్మార్గంలో నడిచి జీవితాలను సార్థకం చేసుకోవాలని స్వామీజీ సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎంతో ప్రగతిని సాధించామని, అయితే సాధించాల్సినది ఇంకా చాలా ఉందని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. లక్ష్యం లేని సాధన నిరర్థకమని తెలిపారు. సమాజ హితానికి వ్యక్తి తోడ్పడకపోతే లాభం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అధ్యాపకులు, రామకృష్ణ మఠం వాలంటీర్లు, యువతీ యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.